వ్యాకరణ పరిభాష
సంధులలో వచ్చే కొన్ని వ్యాకరణ పదాలకు అర్థాలు.
(వ్యాకరణ వ్యాసాలు వ్రాసి పంపగోరే వారు దయచేసి admin@haaram.com కు మైల్ చేయండి.)
1) ఏకాదేశము : రెండు వర్ణములకు [ వర్ణము=అక్షరము] బదులు ఒకే వర్ణము వచ్చుటను ఏకాదేశమందురు.
ఉదా : రాముడు+అతడు=రాముడతడు
ఇందులో మొదటి పదములోని చివరి ఉకారము పోయి రెండవ పదములోని మొదటి అకారము ఏకాదేశముగా వచ్చినది.
2) ఆదేశము : ఒక అక్షరమును తొలగించి మరొక అక్షరము రావడాన్ని ఆదేశము అంటాము.
నీవు + టక్కరి = నీవుడక్కరి.
ఇక్కడ "ట" బదులు "డ" వచ్చినది.
3) ఆగమము : రెండు పదముల మధ్య మరొక అక్షరము వచ్చి చేరడాన్ని ఆగమము అంటాము.
నీ+బిడ్డ = నీదుబిడ్డ
ఇందు "దు" ఆగమముగా వచ్చినది.
4)నిత్యము : సంధి కార్యము తప్పని సరిగా జరిగిన దానిని నిత్యము అంటారు.
ఉదా : రామ+అయ్య = రామయ్య
5) వైకల్పికము లేక విభాష : సంధికార్యము ఒకసారి వచ్చుట, మరొకసారి రాకపోవుటను వైకల్పికము లేదా విభాష అంటాము.
ఉదా: మేన+అత్త= మేనత్త లేదా మేనయత్త.
ఇక్కడ సంధి జరిగినప్పుడు మేనత్త అయినది.సంధి జరగనపుడు "య" ఆగమముగా వచ్చి మేనయత్త అయినది.
6)బహుళము : సంధికార్యము ఒకసారి నిత్యముగాను [ ఎల్లప్పుడూ ] మరొకసారి వైకల్పికము గాను, ఒకసారి సంధిరాకుండుటను, మరొకసారి వేరే విధముగా వచ్చుటను బహుళము అందురు.
ఉదా : సోమ+అయ్య = సోమయ్య [ నిత్యము]
మేన+అత్త =మేనత్త, మేనయత్త [ వైకల్పికము]
వనిత+ఆమె=వనితయామె [ సంధిరాకుండుట]. ఇక్కడ సంధి రాకపోవుటచే "య" ఆగమముగా వచ్చినది.
ఒక+ఒక = ఒకానొక [ వేరేవిధంగా వచ్చినది]
7)ఆమ్రేడితము : ఒకపదమును రెండుసార్లు చెప్పిన రెండవ పదమును ఆమ్రేడితమందురు.
ఉదా : ఔర+ఔర=ఔరౌర
ఇందులో రెండవ సారి చెప్పిన "ఔర" ఆమ్రేడితము
8) ద్విరుక్తము : రెండుసార్లు చెప్పబడిన పదమును ద్విరుక్తము అందురు.
ఉదా: దాపు+దాపు=దాదాపు
ఇందు "దాపు" అనుపదము రెండుసార్లు చెప్పబడింది కావున అది ద్విరుక్తము.
9) ద్విత్వము : ఒక హల్లు క్రింద అదేహల్లు వచ్చిన ద్విత్వము అందురు.
ఉదా : అన్న, అక్క, అవ్వ ఇందు న్న,క్క,వ్వ అను అక్షరాలు ద్విత్వములు
10) సంయుక్తము : ఒక హల్లుతో వేరేహల్లు చేరిన సంయుక్తము అందురు.
ఉదా : పద్యము, రక్తము. ఇందు "ద్య" సంయుక్తాక్షరము. ద అక్షరానికి య వత్తు వచ్చినది.
11) సంశ్లేషము : సంధి జరుగునపుడు మొదటిపదము చివరిహల్లు రెండవపదము మొదటిహల్లుతో చేరిన సంశ్లేషమందురు.
ఉదా : కృష్ణున్+గొలిచెద= కృష్ణున్గొలిచెద
ఇందులో "న్గొ" సంశ్లేషము